ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరదల వల్ల మరణించినవారి సంఖ్య 20కి చేరింది. ముంబై మహానగరంలో శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిచెందారు. భారీ వర్షాలకు చెంబూరులోని భరత్‌నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడటంతో గోడ కూలింది. దీంతో 19 మంది మరణించగా, అనేక ఇండ్లు కూలిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు 19 మందిని శిథిలాల కింది నుంచి రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను రాజవాడి, సమీప దవాఖానలకు తరలించారు.
ముంబైలోని విఖ్రోలి భవనం కూలిపోయింది. దీంతో మరో ముగ్గురు మృతిచెందారు. భారీ వర్షాలకు భవనం కూలినట్లు బృహిన్ ముంబై మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. విఖ్రోలిలోని సూర్యానగర్‌లో మరో నాలుగు ఇండ్లు కూలిపోయాయన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బోరివాలిలో పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షం కారణంగా ముంబైలో లోకల్ ట్రైన్లను రద్దు చేశారు.
ముంబై వరదల్లో ప్రాణనష్టంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాల వల్ల ముంబైలోని చెంబూర్, విఖ్రోలీ ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో చాలా మంది గాయపడటం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాకచర్యలు విజయవంతకావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
Deeply saddened by the news of many casualties in incidents following heavy rain in Mumbai's Chembur and Vikhroli areas. I express my condolences to the bereaved families and wish for successful relief and rescue work, tweets President Ram Nath Kovind pic.twitter.com/cT5f2sQs56
— ANI (@ANI) July 18, 2021
మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, గాయపడిన బాధితులకు రూ.50 వేల చొప్పున అందిస్తామని వెల్లడించింది.