థానే: పెండ్లి పేరుతో ఓ మహిళను మోసగించి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి ఏడేండ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో విచారణ చేపట్టిన థానే కోర్టు నిందితుడు దోషిగా నిర్ధారణ కావడంతో శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని గోవండి ప్రాంతానికి చెందిన 37 ఏండ్ల వ్యక్తి పక్కనేగల థానేకు చెందిన మహిళకు 2010లో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం వారి మధ్య చనువును పెంచింది. ఈ చనువును అడ్డం పెట్టుకుని సదరు వ్యక్తి మహిళను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడిని నమ్మిన మహిళను మోసం చేశాడు. రెండుసార్లు లాడ్జికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దాంతో బాధిత మహిళ.. ఇచ్చిన మాట ప్రకారం తనను పెండ్లి చేసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.
మహిళ హెచ్చరికతో దిగొచ్చిన నిందితుడు 2015లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం థానేలోని ఓ హోటల్లో గది అద్దెకు తీసుకుని మహిళను అక్కడికి తీసుకెళ్లాడు. అ మర్నాడే అక్కడి నుంచి జారుకున్నాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో ఇప్పుడు విచారణ జరిపిన థానే కోర్టు నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేసింది.