ముంబై: సెలవుల్లో ఉన్న ఉద్యోగులకు పనిపరంగా ఇబ్బంది కలిగించే సిబ్బందికి లక్ష జరిమానా విధించాలని ఒక సంస్థ నిర్ణయించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 సంస్థ ఈ మేరకు తన ఉద్యోగులకు హెచ్చరించింది. వార్షిక సెలవుల్లో ఉన్న ఉద్యోగిని సహోద్యోగి సంప్రదించి వర్క్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడితే లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 2008లో ఏర్పాటు చేసిన డ్రీమ్11 సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిత్ షేత్ ఒక టీవీ చానల్ ఇంటర్వూలో ఈ విషయం తెలిపారు. తమ కంపెనీ ఉద్యోగులు ప్రతి ఏటా కనీసం ఒక వారం రోజులపాటు వార్షిక సెలవు తీసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు. ఈ లీవ్‌లో ఉన్న ఉద్యోగులకు సంస్థ నుంచి ఎలాంటి ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, లేదా పని గురించి ఆరాలు ఉండవని అన్నారు. ఉద్యోగులు ఒక వారం రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేని విరామ సమయాన్ని గడిపేందుకు ఇది దోహదపడుతుందని వెల్లడించారు.
కాగా, ఎవరిపైన అయినా సంస్థ ఆధారపడుతున్నదా అన్నది కూడా తెలుసుకోవడంతోపాటు సంస్థ వ్యాపారాభివృద్ధికి తమ నిర్ణయం సహకరిస్తున్నదని భవిత్ తెలిపారు. అలాగే డ్రీమ్స్టర్లు (డ్రీమ్ 11 ఉద్యోగులు) సెలవుల్లో పూర్తిగా రిలాక్స్, రీఛార్జ్ అయిన తర్వాత తిరిగి పనికి హాజరైనప్పుడు మంచి పనితనం, చురుకుదనంతోపాటు ప్రతిభ పెరుగుతుందని తమ సంస్థ నమ్ముతుందని చెప్పారు. అందుకే ఉద్యోగులు తమ విరామ సమయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించేందుకే లక్ష జరిమానా నిర్ణయం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.