న్యూఢిల్లీ, జూన్ 22: కొత్త టెలికం చట్టం-2023 ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ టెలికమ్యూనికేషన్స్ సేవలు లేదా నెట్‌వర్క్‌నైనా తన నియంత్రణలోకి తీసుకొనే అధికారం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. జూన్ 26 నుంచి అమల్లోకి వచ్చేలా టెలికమ్యూనికేషన్స్ యాక్ట్‌ను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది.
భద్రత, పబ్లిక్ ఆర్డర్, నేరాల నియంత్రణ కోసం ఏ సమయంలోనైనా కేంద్ర ప్రభుత్వం టెలికం సర్వీసులను తన అధీనంలోకి తీసుకోవచ్చని గెజిట్ నోటిఫికేషన్ చెబుతున్నది. విపత్తు నిర్వహణ వంటి ఏదైనా ప్రజా అత్యవసర పరిస్థితి ఏర్పడితే లేదా ప్రజల భద్రత ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున ప్రత్యేక అధికారాలు ఇచ్చిన ఏ అధికారి అయినా ఏ టెలికమ్యూనికేషన్ సర్వీస్‌నైనా లేదా నెట్‌వర్క్‌నైనా సంబంధిత సంస్థ నుంచి తాత్కాలికంగా తమ నియంత్రణలోకి తీసుకోవచ్చని సెక్షన్ 20 చెబుతున్నది.