ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కొత్త రోల్స్ రాయిస్ కొన్నారు. ఆ కారు ఇండియాలోనే అత్యంత ఖరీదైన్నట్లు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. అల్ట్రా లగర్సీ రోల్స్ రాయిస్ హ్యాచ్బాక్ కారు ధర సుమారు 13.14 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. రోల్స్ రాయిస్ కలినన్ పెట్రోల్ మోడల్ కారును రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరటి రిజస్టర్ చేయించారు. దక్షిణ ముంబైలోని టార్డియో రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు వద్ద జనవరి 31న ఈ కారుకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇండియాలో ఈ కారును 2018లో లాంచ్ చేశారు. దాని బేస్ ప్రైజ్ 6.95 కోట్లు. కానీ కస్టమైడ్జ్ మార్పుల వల్ల ఆ కారు ఖరీదు రెట్టింపు అయినట్లు అధికారులు భావిస్తున్నారు.
12 సిలిండర్ కారు సుమారు 2.5 టన్నుల బరువు ఉంది. 564 బీహెచ్పీ పవర్. దీని కోసం స్పెషల్ నెంబర్ ప్లేట్ తీసుకున్నట్లు ఆర్టీవో అధికారులు చెప్పారు. టస్కన్ సన్ కలర్లో కారు ఉన్నట్లు తెలిపారు. ఆ కారుపై ఒకేసారి 20 లక్షల ట్యాక్స్ కట్టేశారు. రిజిస్ట్రేషన్ గడువు తేదీ జనవరి 30, 2037 వరకు ఉంది. దీంతో పాటు రోడ్ ట్యాక్స్ కోసం అదనంగా 40 వేలు చెల్లించారు. వీఐపీ నెంబర్ కోసం రిలయన్స్ సంస్థ అదనంగా 12 లక్షలు కట్టినట్లు అధికారులు తెలిపారు. 0001 నెంబర్ను ఆ కారుకు కేటాయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా వీఐపీ నెంబర్ ధర 4 లక్షలు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న సిరీస్లో ఆ నెంబర్ అందుబాటులో లేదు. దీంతో కొత్త సిరీస్ను స్టార్ట్ చేశారు.
ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇచ్చే రాతపూర్వక పర్మిషన్తో ఆర్టీవో అధికారులు కొత్త సిరీస్ను 0001తో స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆ నెంబర్ కావాలనుకునేవాళ్లు మూడు రెట్లు ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంబానీ గ్యారేజీలో ఇప్పటికే రోల్స్ రాయిస్ కలినన్ మోడళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది మూడవ మోడల్ కారు అవుతుంది. కొందరు బాలీవుడ్, పారిశ్రామికవేత్తల వద్ద కూడా ఈ కారు ఉంది.
రోల్స్ రాయిస్ కార్లను బ్రిటీష్ కంపెనీ తయారు చేస్తుంది. కలినన్ మోడల్.. ఆల్ టెర్రెయిన్ ఎస్యూవీ. ఎటువంటి రోడ్డుమీదైనా ఇది ప్రయాణిస్తుంది.