DK Shiva Kumar : ముడా కుంభకోణం (MUDA scam) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka Cm) సిద్ధరామయ్య (Siddaramaiah) పై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ (Governor) థావర్‌చంద్ గెహ్లాట్ (ThavarChand Gehlot) అనుమతించడంతో సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తారనే అంచనాలు జోరందుకున్నాయి. అయితే ఈ ఊహాగానాలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొట్టిపారేశారు.
సీఎం సిద్ధరామయ్య ఎట్టి పరిస్థితుల్లో సీఎం పదవికి రాజీనామా చేయబోరని డీకే స్పష్టం చేశారు. కర్ణాటక క్యాబినెట్ అంతా ఆయనకు మద్దతుగా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధరామయ్యకు అండగా ఉందని అన్నారు. ముడా కుంభకోణం బీజేపీ కుట్ర అని డీకే ఆరోపించారు. గవర్నర్ కార్యాలయం బీజేపీ కార్యాలయంలా మారిపోయిందని మండిపడ్డారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటే గవర్నర్ వ్యవస్థను కూడా నరేంద్రమోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం తమకు రక్షణ కల్పిస్తుందనే నమ్మకం తమకు ఉన్నదని చెప్పారు. రాజకీయంగా, చట్టబద్ధంగా తాము ఈ కుట్రను ఎదుర్కొంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే.. అక్కడ గవర్నర్లు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కుట్రలను తాము సాగనివ్వబోమని చెప్పారు.