MUDA Case | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణంపై కర్ణాటక లోకాయుక్త ఎస్పీ టీజే ఉదేశ్ గురువారం 8వేల పేజీల ఇంట్రీమ్ ‘బీ’ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. లోకాయుక్త అధికారుల బృందం ముడా దర్యాప్తుకు సంబంధించిన పత్రాలను నాలుగు బ్యాగుల్లో ప్రజాప్రతినిధుల కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాలు దర్యాప్తునకు సంబంధించిన కీలకమైన పత్రాలని పేర్కొన్నారు. ముడా భూకుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు లోకాయుక్తా క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ కుంభకోణంలో ఆరోపణలపై ఆధారాలు లేవని.. దాంతో కుంభకోణాన్ని నిరూపించలేమని పేర్కొంటూ లోకాయుక్త పోలీసులు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు లేఖ రాశారు. ఐపీసీ, అవినీతి నిరోధకచట్టం, కర్ణాటక భూసేకరణ చట్టం వంటి అనేక నిబంధనలను లేఖలో ప్రస్తావించారు. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు నలుగురికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని.. ఈ కేసులో నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాల్లేకపోవడంతో నిరూపితం కాలేదని పేర్కొన్నారు. ఈ నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు స్నేహమయికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్న లోకాయుక్త పోలీసులు.. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
కేసులో నలుగురు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని.. తుది నివేదికను కోర్టుకు సమర్పించినట్లు ఎస్పీ ఉదేశ్ పేర్కొన్నారు. లోకాయుక్త లేఖపై సామాజిక కార్యకర్త, ఫిర్యాదుదారుడు స్నేహమయి కృష్ణ స్పందించారు. లోకాయుక్తపై ఆయన విమర్శలు గుప్పించారు. రాజకీయ నేతలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు. లోకాయుక్తపై తనకున్న సందేహాలు నిజమని నిరూపితమయ్యాయన్నారు. లోకాయుక్త అధికారులు తమ ఆత్మలను రాజకీయ నాయకులకు అమ్ముక్కున్నట్లుగా ప్రవర్తించారని విమర్శించారు. తాను అవసరమైన అన్ని పత్రాలు ఇచ్చినప్పటికీ సిద్ధరామయ్య, పార్వతి, మల్లికార్జున స్వామి, దేవరాజ్లపై ఎలాంటి ఆధారాలు లేవంటూ ‘బీ’ రిపోర్టును దాఖలు చేయబోతున్నారని ఆరోపించారు.