న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే పరిమాణం కలిగిన సమోసాను విక్రయించే విధంగా ఓ చట్టాన్ని తీసుకురావాలని నటుడు, గాయకుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన గురువారం లోక్సభలో జీరో అవర్లో మాట్లాడుతూ, కొన్ని చోట్ల సమోసా పరిమాణం పెద్దగా ఉంటున్నదని, మరికొన్ని చోట్ల చిన్నగా ఉంటున్నదని, వాటి ధరలు కూడా వేర్వేరుగా ఉంటున్నాయని చెప్పారు. వీటి సైజు, ధరలను క్రమబద్ధీకరించేందుకు చట్టాన్ని తీసుకురావాలని కోరారు.
దాల్ టడ్కా ఒక చోట రూ.100కు, కొన్ని హోటళ్లలో రూ.1,000కి లభిస్తున్నదని చెప్పారు. ఏయే తినుబండారాల్లో ఏయే పదార్థాలను కలుపుతున్నారు? వాటి పరిమాణం ఎంత? అనే విషయాలను ఖాతాదారులకు తెలిసే విధంగా ప్రదర్శించాలన్నారు. తాము తింటున్నది ఏమిటి? దానికి ఎంత చెల్లిస్తున్నాము? అనే విషయాలను తెలుసుకునే హక్కు ఖాతాదారులకు ఉందన్నారు.