న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్పై సమాజ్వాదీ నేత, ఎంపీ రామ్గోపాల్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ, అయోధ్య రామజన్మ భూమి వివాదం పరిష్కారం కోసం తాను దేవుడ్ని ప్రార్థించానని చెప్పారు. దీనిపై సోమవారం ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పందిస్తూ, ‘మీరు చనిపోయినవారిని తిరిగి బతికిస్తే.. అవి దయ్యాలుగా మారి ప్రజల్ని వేధిస్తాయి. చాలా మంది ఇలాగే మాట్లాడుతారు. నేను వాటిని పట్టించుకోవాల్నా?’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠీ అన్నారు. సమాజ్వాదీ పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీజేఐని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ కూడా సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అయోధ్య కేసులో దేవుడ్ని ప్రార్థించానని సీజేఐ చెప్పారు. అలాగే మిగతా కేసుల్లోనూ దేవుడ్ని ప్రార్థించాల్సింది. ఆ కేసుల్లోనూ సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి సామాన్యుడికి న్యాయం దక్కేది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ దుర్వినియోగాన్ని ఆపాల్సింది.. కదా!’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.