భోపాల్: ఓటు హక్కు, ప్రజాస్వామ్యం అనేవి దేశానికి అతిపెద్ద తప్పులని ఒక ప్రభుత్వ అధికారి అన్నారు. దీంతో ఆయనను బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్య ప్రదేశ్లో ఈ సంఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తుది దశ పోలింగ్ బుధవారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. అయితే బ్యాలెట్ పేపర్ల కొరత వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు శివపురి జిల్లా అదనపు కలెక్టర్ ఉమేష్ శుక్లాను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాము ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు.
ఈ సందర్భంగా ఉమేష్ శుక్లా వారి నుద్దేశించి మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమవుతుంది? అని అడిగారు. ‘ఇప్పటి వరకు ఓటు వేయడం ద్వారా మీకు ఏం లభించింది? మనం ఎంత మంది అవినీతి నాయకులను తయారు చేశాం?’ అని ప్రశ్నించారు. ఓటింగ్ విధానం వల్ల అవినీతి రాజకీయ నేతలు ఎన్నికవుతున్నారని ఆరోపించారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్యం అనేవి దేశానికి అతి పెద్ద తప్పులుగా తాను భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, శివపురి జిల్లా అదనపు కలెక్టర్ ఉమేష్ శుక్లా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా దీనిపై స్పందించారు. ఇది చాలా సీరియస్ అంశమని తెలిపారు. ఆ అధికారిని బదిలీ చేస్తామని మీడియాతో ఆయన అన్నారు.