భోపాల్ : హిజాబ్ వివాదం కొనసాగుతుండగా అంతకుముందు హిజాబ్ నిషేధాన్ని సమర్ధిస్తూ స్కూల్స్‌లో డ్రెస్ కోడ్ ప్రతిపాదనను సమర్ధించిన మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ఆపై యూటర్న్ తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో హిజాబ్‌పై ఎలాంటి వివాదం లేదని మంత్రి స్పష్టం చేశారు. హిజాబ్ నిషేధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదననూ పరిశీలించడం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికీ తావులేదని చెప్పుకొచ్చారు. కర్నాటకలో హిజాబ్ ధరించడానికి అనుకూలంగా, ప్రతికూలంగా జరుగుతున్న ఆందోళనలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా స్పందించారు. సున్నితమైన ఈ వ్యవహారంలో దేశంలో వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొందరు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. డ్రెస్ కోడ్‌పై తన మాటలను కొందరు వక్రీకరించారని విద్యాశాఖ మంత్రి పర్మార్ వివరణ ఇచ్చారు.
తాము ఎలాంటి డ్రెస్ కోడ్‌ను, నూతన యూనిఫాంను ప్రవేశపెట్టడం లేదని స్పష్టం చేశారు. స్కూళ్లలో సమానత్వానికి సంకేతంగా విద్యార్ధులందరూ యూనిఫాంను ధరించాలని ఆయన కోరారు. ఇక ముస్లిం యువతులు ఎప్పటినుంచో హిజబ్ ధరిస్తున్నారని ఇప్పుడు దీనిపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ముస్లిం యువతులను హిజబ్ ఆధారంగా వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఇది పూర్తిగా వివక్షతో కూడుకున్నదని మండిపడ్డారు. ఏ ఒక్కరి రాజ్యాంగ హక్కును నిరాకరించడం సరైంది కాదని అన్నారు. ముస్లిం యువతులను హిజబ్ ధరించకుండా మీరు ఎలా వేరుచేస్తారని ఆయన ప్రశ్నించారు. బేటీ బచావో..బేటీ పఢావో అని బీజేపీ నినదిస్తుండగా అసలు హిజబ్ వ్యవహారంలో మహిళా సాధికారత ఎక్కడ ఉందని ఓవైసీ ఓ వార్తాచానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. ముస్లిం బాలిక ఇంటి నుంచి కాలుబయట పెడితే హిజబ్ ధరిస్తుందని, అనూహ్యంగా వీరికి కాషాయ కండువాలు ఎవరిస్తున్నారని అన్నారు. కాషాయ శాలువాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఓవైసీ నిలదీశారు.
హిజబ్ వ్యవహారంపై కర్నాటక ప్రభుత్వ తీరును ఆయన తప్పుపట్టారు. ముస్లిం బాలికలను హిజబ్ ధరించకుండా అడ్డుకోవడం వారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఆక్షేపించారు. హిజబ్‌పై బీజేపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు.విద్వేష రాజకీయాలకు ఈ ఉదంతం విస్పష్ట ఉదాహరణని, ఇలాంటి శక్తులను బీజేపీ ప్రేరేపిస్తోందని ఆరోపించారు. మరోవైపు కర్నాటకలో హిజాబ్ వివాదం నడుస్తుండగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం తినాలి..ఏ దుస్తులు ధరించాలనేది ప్రజల ప్రాధమిక హక్కని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తన ఇష్టాలను ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉత్తరాదిన స్త్రీలు తమ ముఖానికి ముసుగు కప్పుకోవడం అక్కడి సంస్కృతి అని, కాషాయపార్టీ నేతలు ఆ పద్ధతిని కూడా తొలగిస్తారా అని ఆయన ప్రశ్నించారు. కమలనాధులు ఆధిపత్య రాజకీయాలను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం బాలికలు కాలేజీలకు వెళ్లి చదువుకుంటుంటే బీజేపీ నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు.