హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పర్యావరణ వేత్త, వృక్షమాతగా ప్రసిద్ధిచెందిన సాలుమరద తిమ్మక్క(114) శుక్రవారం బెంగళూరులో కన్నుమూశారు. తిమ్మక్క దశాబ్దాల పాటు గ్రామీణ కర్ణాటకలో పచ్చదనం పెంపొందించడానికి అవిశ్రాంత కృషి చేశారు.
రామనగర జిల్లాలోని హులికల్-కుడూర్ మార్గంలో 4.5 కిలోమీటర్ల పొడవునా 385 మర్రి మొక్కలు నాటడంతో ఆమెకు సాలుమరద(చెట్ల వరుస) అనే పేరు వచ్చింది. ఆమె పర్యావరణానికి చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం(2019), ఇందిర ప్రియదర్శి వృక్షమిత్ర అవార్డ్(1997) వరించాయి.

ప్రకృతి ప్రేమికురాలు తిమ్మక్క మృతి బాధాకరమని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. వేల మొక్కలు నాటడంలో ఆమె చూపిన అంకిత భావం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఆమెతో కలిసి మొక్కలు నాటిన అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు.