చెన్నై, ఆగస్టు 29: తల్లికి బిడ్డే లోకం. బిడ్డ కంట్లో నీళ్లు కనపడితే తల్లి మనసు తల్లడిల్లుతుంది. బిడ్డకు ఏ చిన్న బాధ కలగకుండా అమ్మ కంటికి రెప్పలా కాచుకొంటుంది. అందుకే ఈ సృష్టిలో అమ్మ స్థానం అన్నింటికన్నా గొప్పది. అలాంటిది ఓ తల్లి ముక్కుపచ్చలారని తన 18 నెలల బాబును కర్కశంగా కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ రాక్షసానందం పొందింది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అమ్మే వాతలు తేలేలా, రక్తమొచ్చేలా కొడుతుంటే ఎలా కాపాడుకోవాలో ఆ చిన్నారికేం తెలుసు! కాలి వేలికి అయిన గాయంపై అమ్మ కొడుతూ రాక్షసానందం పొందుతున్నా ఏడుస్తూ ఆమె ఒళ్లోనే వాలిపోయాడు. వెల్లికిలా పడుకోబెట్టి ముక్కుపై, మూతిపై పిడికిలితో రక్తం వచ్చేలా కసితీరా గుద్దినా అమ్మ నుంచి దూరం పోలేదు. కొట్టి కొట్టి చేతులు నొప్పేస్తున్నా.. బాబు గుండెలవిసేలా రోదిస్తున్నా ఆ తల్లి రాతి గుండె కరగలేదు. బిడ్డను కొడుతున్నప్పుడు ఆమె తన ఫోన్‌ను ఎదురుగాపెట్టి వీడియో తీసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తులసికి తమిళనాడు యువకుడు వడివేలగన్తో నాలుగేండ్ల క్రితం పెండ్లి అయింది. వారికి ఇద్దరు పిల్లలు. మనస్పర్థలతో వడివేలగన్ తులసిని ఏపీలోని ఆమె తల్లి ఇంట్లో వదిలేసి వెళ్లాడు. భర్తపై కోపమో.. మానసిక సమస్యో తెలియదు కానీ తులసి బాబును రోజూ కొట్టేది. ఆమె ఫోన్లోని వీడియోలను బంధువులు చూసి ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. దీంతో వడివేలగన్ వచ్చి తన కొడుకుని తీసుకెళ్లిపోయాడు.