అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్ బయల్దేరిన విమానం కాసేపటికే కుప్పకూలి 265 మందికి పైగా మృతిచెందారు. ఇంకా దేశం ఆ విషాదం నుంచి తేరుకోలేదు. ఈ ఘటన జరిగి 24 గంటలు దాటినా ఈ ప్రమాదంలో తన తల్లి, బిడ్డ జాడ కనిపించకుండా పోయిందని ఓ వ్యక్తి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశాడు. విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీలో రవి ఠాకూర్, తన తల్లి, భార్యతో కలిసి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సీనియర్ డాక్టర్ల కోసం మెస్ నుంచి దవాఖానకు తన భార్యతో కలిసి భోజనం తీసుకెళ్లినట్టు తెలిపాడు. తన తల్లి సరళతో పాటు బిడ్డ ఆద్య ఉన్నారని చెప్పాడు.
అదే సమయంలో విమానం కూలిందని పేర్కొన్నాడు. ఘటన జరిగి 24 గంటలు గడిచిందని, మృతి చెందిన, గాయపడిన మెడికోలందరినీ గుర్తించారని తనవారి జాడ మాత్రం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి అచూకీ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలన్నీ వెతికినట్టు చెప్పాడు. మెస్‌లోకి అనుమతించడం లేదని, వారంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు తమకు అనుమానంగా ఉందని తెలిపాడు. తమను లోనికి అనుమతించాలని వేడుకున్నాడు.
అక్కడ పని చేస్తున్న మరో వంటమనిషి మీనా మిస్త్రీ మాట్లాడుతూ ‘విమానం కూలిన సమయంలో మెడికోల కోసం రోటీలు చేస్తున్నాం.. మొదట గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకున్నాం.. కాసేపట్లోనే ఇదేదో పెద్ద ప్రమాదమని గుర్తించాం.. అంతా చీకటి కమ్ముకుంది.. మా ఫోన్లు, కీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలువదు.. నా స్కూటీ ధ్వంసమైంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరో వంటమనిషి నీమాబెన్ నిగమ్ మాట్లాడుతూ తాము ఇక్కడ 30 ఏండ్లుగా పనిచేస్తున్నామని, పెద్ద శబ్దం విని బయటకు పరుగులు తీసినట్టు తెలిపింది.