లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి సెగలు తీవ్రమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నైరాశ్యపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆయన శాసనసభలో గురువారం మాట్లాడుతూ, ‘ఇది ప్రతిష్ఠ కోసం పోరాటం కాదు, ఇంతకన్నా ఎక్కువ గౌరవం నా మఠంలో నాకు లభిస్తుంది’ అన్నారు. బుల్డోజర్ విధానం వల్ల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిందని మంత్రి సంజయ్ నిషాద్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందించారు. బుల్డోజర్ విధానం అమాయకులను ఇబ్బంది పెట్టడానికి కాదని చెప్పారు. యువత, వ్యాపారులు, బాలికలు, మహిళల భద్రతతో ఆడుకునే క్రిమినల్స్, అరాచకాన్ని వ్యాపింపజేస్తూ, సామాన్యుల జీవితాలను దుఃఖమయం చేసేవారు పర్యవసానాలను అనుభవించేలా చేయడం కోసమే తాను పోరాడుతున్నానని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగలడంతో యోగిపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.