MPox | మంకీపాక్స్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుండడంతో ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్రికా దేశాల్లో నమోదైన కేసులు ప్రస్తుతం అమెరికా, యూకేతో పాటు ఆసియా దేశాల్లోనూ వ్యాప్తి చెందుతున్నది. భారత్‌లోనూ తొలి కేసు నమోదైంది. సదరు వ్యక్తి ఇటీవల మంకీపాక్స్ సోకిన దేశానికి వెళ్లాడని.. అక్కడే అతడికి వైరస్ సోకిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం సదరు వ్యక్తిని వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. దేశంలో మంకీపాక్స్ ఇతర వ్యక్తులకు సోకే ప్రమాదం, సంకేతాలు లేవని.. భయపడాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ ఓ అడ్వైజరీలో పేర్కొంది. ప్రజలంతా తప్పనిసరిగా ఏదైనా ఇన్ఫెక్షన్ల నివారణ గురించి జాగ్రత్త ఉండాలని చెప్పింది.
నిర్దిష్ట వయసుగల వ్యక్తుల్లో సంక్రమణ రేటు ఎక్కువగా ఉందని.. ప్రమాదకారకాలపై దృష్టి సారిస్తే తమను తాము రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. మంకీపాక్స్ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సూచించారు. మంకీపాక్స్ విషయంలో మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం కీలమని నిపుణులు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తికి లైంగిక సంబంధాలు.. వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్న సమయంలో ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, దీనికి జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచించారు.
అయితే, యువకుల్లోనే ఎక్కువగా మంకీపాక్స్ కేసులు కనిపిస్తున్నాయని.. 18-44 సంవత్సరాల మధ్య వయస్కులు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 96.4శాతం మందికి మంకీపాక్స్ సోకింది. వీరి సగటు వయసు 34 సంవత్సరాలుగా తెలిపింది. అయితే, మహిళలు సైతం ప్రమాదంలో ఉన్నా.. చాలా తక్కువ కేసులు ఉన్నాయని డేటా పేర్కొంది. సాధారణంగా మంకీపాక్స్ సోకిన సందర్భంలో శరీరంపై దద్దుర్లు, పెద్ద పెద్ద మొటిమల తరహాలో లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. జ్వరం, కండరాల నొప్పి, గొంతు నొప్పితో పాటు అరచేతులు, అరికాళ్లు, ముఖం, నోరు, గొంతు, జననేంద్రియాలు, పాయువుపై దద్దుర్లు కనిపిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. శోషరస కణుపుల్లో వాపు, అలసట, బలహీనంగా ఉండడం తదితర సమస్యలు ఉంటాయని చెప్పారు.
మంకీపాక్స్ లక్షణాలు సోకిన 21 రోజుల్లో కనిపిస్తాయని.. ప్రభావం రెండు నుంచి మూడు వారాల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 2023లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. 96.4శాతం పురుషుల్లో 84.2శాతం కేసులు లైంగిక సంబంధాల ద్వారా మంకీపాక్స్ సోకినట్లు తేలింది. ఇందులో స్వలింగ, ద్విలింగ సంపర్కులు ఉన్నారు. వరల్డ్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 95.7శాతం కేసులు పురుషుల్లో.. మరో 2.3 కేసులు మహిళల్ల కనిపించాయి. లైంగిక సంబంధాలు, వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉండడం, వైరస్ సోకిన వ్యక్తులు ధరించిన బట్టలు ఉపయోగించడం ద్వారా వస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.