న్యూఢిల్లీ, జూన్ 11: వారసత్వ రాజకీయాలు, వారసత్వ పాలన అంటూ విపక్ష పార్టీలపై పదేపదే విమర్శలు గుప్పించే ప్రధాని మోదీ.. కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాబినెట్లో అదే వారసత్వ నేతలకు పెద్ద పీట వేశారు. చాలా మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకే మంత్రి పదవులు కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడే మాటలకు, చేతలకు పొంతన ఉండదనే విమర్శలు వస్తున్నాయి.
కొత్త క్యాబినెట్లో మంత్రి పదవులు చేపట్టిన వాళ్లలో చాలా మందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నది. ఈ జాబితాలో హెచ్డీ కుమారస్వామి, కిరణ్ రిజిజు, జయంత్ చౌదరి, జ్యోతిరాదిత్య సింధియా, చిరాగ్ పాశ్వాన్, పీయూశ్ గోయల్ తదితరులు ఉన్నారు. కేంద్ర క్యాబినెట్లో మరోసారి మంత్రి అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి జయశ్రీ బెనర్జీ అల్లుడు కావడం గమనార్హం. నూతన కేంద్ర క్యాబినెట్‌ను ‘పరివార్ మండలి’గా కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శించారు.