BJP MP Rajveer singh | కాన్పూర్, ఏప్రిల్ 25: ఆయన బీజేపీకి చెందిన లోక్సభ ఎంపీ. సారు రైలులో ప్రయాణిస్తుంటే దోమలు కుట్టాయి. ఇంకేముంది.. రైల్వే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. రైలును ఆపేసి మరీ ఎంపీ గారిని కరిచిన దోమల అంతుచూశారు. ఈ తతంగమంతా ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న గోమతి ఎక్స్ప్రెస్లో జరిగింది.
యూపీలోని ఇటా ఎంపీ రాజ్వీర్ సింగ్ను దోమలు కుట్టడంపై అనుచరుడు మాన్సింగ్ ట్విట్టర్లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ‘ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్ అధ్వానంగా ఉంది.’ అని ట్వీట్ చేశారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఉన్నావ్ స్టేషన్లో ఆపి బోగీ మొత్తం దగ్గరుండి శుభ్రం చేయించారు. దోమలను వెళ్లగొట్టేందుకు ఫాగింగ్ చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది. తమ ఫిర్యాదులపైనా ఇలాగే స్పందించాలని సాధారణ ప్రయాణికులు కోరుతున్నారు.