న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు, గత ఆరేడు ఏళ్ల నుంచి ఆ రంగానికి లభిస్తున్న మద్దతు వల్ల.. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా తయారైనట్లు ప్రధాని మోదీ అన్నారు. బిల్డ్ సినర్జీ ఫర్ సీమ్‌లెస్ క్రెడిట్ ఫ్లో అండ్ ఎకనామిక్ గ్రోత్ అన్న అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 కన్నా ముందు ఉన్న అన్ని సమస్యలకు తాము దారులు వెతికినట్లు ఆయన చెప్పారు. ఎన్పీఏ సమస్యలను, బ్యాంకుల రిక్యాపిటలైజేషన్, ఐబీసీ సంస్కరణలు చేపట్టామన్నారు. అప్పుల రికవరీ కోసం ట్రిబ్యునల్‌ను బలోపేతం చేసినట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ వేళ కూడా బ్యాంకులు మెరుగ్గా కోలుకున్నట్లు చెప్పారు. బ్యాంకులు మరింత బలోపేతం అవుతున్నాయని, వాటిల్లో కొత్ శక్తి వచ్చినట్లు ఆయన తెలిపారు. బ్యాంకుల వద్ద రుణం తీసుకుని ఎగ్గొట్టి పారిపోయేవాళ్లు ఉన్నారని, దాని గురించి అందరూ చర్చిస్తారని, కానీ ఓ ప్రభుత్వం చాలా సాహసం చేసి ఆ రుణఎగవేత దారులను పట్టుకువస్తుందని, దాని గురించి ఎవరూ చర్చించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వాల సమయంలో స్తంభించిపోయిన లక్షల కోట్ల రూపాయాల్లో తమ ప్రభుత్వం అయిదు లక్షల కోట్లకు పైగా రికవరీ చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు.