‘ద కింగ్ మస్ట్ కలెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఎకార్డెన్స్ విత్ ధర్మ (ధర్మం ప్రకారం.. రాజు తప్పనిసరిగా పన్నులు వసూలు చేయాలి)’.. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మహాభారతం శాంతిపర్వంలోని ఈ వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో వల్లెవేశారు. కేంద్రమంత్రి అద్భుతమైన వ్యాఖ్యలతో గొప్ప సత్యాన్ని చెప్పారని అనుకోకండి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సామాన్యుల నుంచి పన్నులను మరింతగా పిండుకోవడంలో భాగంగానే నిర్మల ఈ వ్యాఖ్యలను ఉటంకించారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.33.6 లక్షల కోట్ల స్థూల పన్ను వసూళ్లను (గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ-జీటీఆర్) రాబట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. 2022-23 సవరించిన బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది 10.4 శాతం ఎక్కువ. జీటీఆర్ పెంపుతో జీఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీలో పెరుగుదల నమోదు కానున్నది. దీంతో అంతిమంగా సామాన్యుడిపై భారం పడనున్నది. ఇక, నాన్-ట్యాక్స్ రెవెన్యూ ద్వారా (పన్నేతర వసూళ్లు) రూ.3.01 లక్షల కోట్లను వసూలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొన్నది. 2022-23 సవరించిన బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది 15.2 శాతం ఎక్కువ.
సామాన్యుడిపై మూడింతల భారం
వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.23.3 లక్షల కోట్ల నికర పన్ను వసూళ్లను (నెట్ ట్యాక్స్ రెవెన్యూ-ఎన్టీఆర్) రాబట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నది. 2022-23 సవరించిన బడ్జెట్ అంచనాతో పోలిస్తే ఇది 11.4 శాతం ఎక్కువ. 2013-14లో నికర పన్ను వసూళ్లు రూ.8.1 లక్షల కోట్లుగా ఉంటే, గడిచిన పదేండ్లలో ఇది రూ.23.3 లక్షల కోట్లకు చేరింది. అంటే, దేశంలోని ప్రతి పౌరునిపై గడిచిన పదేండ్లలో పన్ను భారం మూడింతలు పెరిగింది.