న్యూఢిల్లీ, జూన్ 18: సామాజిక మాధ్యమాలను మరింత జవాబుదారీగా మార్చాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా స్పష్టమైన ఏకాభిప్రాయం ఉన్నదని, దీనికి అనుగుణంగా నిబంధనలు, చట్టాల్లో అవసరమైన మార్పులు తీసుకొస్తామని తెలిపారు. ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ అనే అంశంపై శనివారం టీవీ-9 నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మీడియా గ్రూపులకు స్వీయ నియంత్రణ ఉండాలని, అవసరమైన చోట స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. సామాజిక మాధ్యమ సంస్థల్లో జవాబుదారీతనం పెరగాలన్న భావన ప్రపంచవ్యాప్తంగా ఉన్నదని, ఇదే అభిప్రాయం భారత్‌లోనూ వ్యక్తమవుతున్నదని చెప్పారు.
నియంత్రణలను ఏ పరిశ్రమ కోరుకోదని, అయినప్పటికీ అవసరమైన చోట, అవసరమైన మేరకు నియంత్రణలను తీసుకురావడం ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద సోషల్ మీడియా సంస్థల అడ్డగోలు నిర్ణయాలు, తప్పుడు కంటెంట్ వ్యాప్తి వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం వినియోగదారులకు గ్రీవెన్స్ అప్పీల్ మెకానిజమ్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా కొత్త సోషల్ మీడియా నిబంధనలను ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొన్నది.