తిరువనంతపురం, డిసెంబర్ 18: కేరళలో మళ్లీ మంకీపాక్స్ కలకలం రేగింది. తాజాగా రెండు కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ బుధవారం ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ నుంచి కేరళకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంకీపాక్స్ వైరస్ బారినపడ్డారని, వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని చెప్పారు. వైరస్‌కు గురైన ఇద్దరిలో ఒకరు వయనాడ్ జిల్లా, మరొకరు కన్నూర్ జిల్లాకు చెందినవారని ప్రభుత్వం తెలిపింది. ఆ ఇద్దరు వ్యక్తులతో కాంటాక్ట్ కలిగిన వాళ్ల వివరాల్ని అధికారులు సేకరిస్తున్నారు. వైరస్ లక్షణాలుంటే తమను సంప్రదించాలని వైద్య అధికారులు కోరారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ మంకీపాక్స్ కేసులు కేరళలో నమోదయ్యాయి.