Monkeypox | న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వ్యాధి తీవ్రత ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితికి దారితీస్తుందో లేదో నిర్ణయించడానికి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
గతంలో ఈ వ్యాధి జాడలు లేని కెన్యా, ఉగాండా, రువాండా, బురుండి దేశాలు కూడా ఈసారి ఈ వ్యాధి బారిన పడ్డాయి. వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందడంపై డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అథనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి జంతువులతో ప్రత్యక్ష సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. ఉడుతలు వంటి చిన్న ప్రాణుల ద్వారా కూడా ఇది సోకుతుందని నిపుణులు తెలిపారు. అయితే కొత్త వేరియంట్ మానవుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని చెప్పారు.
వయనాడ్లో వింత శబ్దాలు
వయనాడ్: కొండచరియలు విరిగిపడి ఘోర విపత్తును ఎదుర్కొంటున్న వయనాడ్వాసులను భూమిలో నుంచి వినిపించిన వింత శబ్దాలు భయాందోళనలకు గురి చేశాయి. వైతిరి తాలుకాలోని అంబలవయల్ గ్రామంలో శుక్రవారం భూమి నుంచి భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలకు ఏం జరుగుతోందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు వయనాడ్ జిల్లా కలెక్టర్ డీఆర్ మేఘశ్రీ తెలిపారు. ఇప్పటివరకు భూమిలో కదలికలు జరిగినట్టు ఎలాంటి సూచనలు లేవని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.