బెంగళూరు: ‘ఈ నగరానికి ఏమైంది? మౌలిక సదుపాయాలు బాగు పడేదెన్నడు? ‘బ్రాండ్ బెంగళూరు’ సాకారమయ్యేనా?’ అని మేధావులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఉన్న రాజధాని నగరంలో ప్రజలకు సరైన సదుపాయాలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ శనివారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి శాఖను నిర్వహిస్తున్న డీకే శివ కుమార్‌ను కలిసిన తర్వాత విలేకర్లతో తన ఆవేదనను పంచుకున్నారు.
బెంగళూరులో మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి డీకేతో మాట్లాడానని చెప్పారు. నగర ప్రజలకు హీరోగా నిలవాలని, దేశంలో అత్యుత్తమ నగరంగా బెంగళూరును తీర్చిదిద్దాలని ఆయనను కోరానని తెలిపారు. బెంగళూరు తలసరి ఆదాయం రూ.13,12,058 అని, దేశంలోనే ఇది అత్యంత సంపన్న నగరమని చెప్పారు. ఇది సైన్స్ సిటీ, స్టార్టప్ సిటీ అని పేర్కొన్నారు. “మాకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత కావాలి, మంచి ఫుట్‌పాత్‌లు, ఉత్తమమైన ప్రజా రవాణా వ్యవస్థ కావాలి. సాధ్యమైనంత త్వరగా మెట్రో రైల్ పూర్తి కావాలి” అని చెప్పారు.