న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశంలో తమ సర్కారుకంటే నిర్ణయాత్మక ప్రభుత్వం ఎప్పుడూ లేదని, అందుకే ఎయిరిండియా ప్రైవేటీకరణతో పాటు అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్పీఏ)ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గనులు, బొగ్గు, రక్షణ, అంతరిక్షం తదితర రంగాల్లో ప్రైవేటు పరిశ్రమలకు ప్రవేశం కల్పించామని, ఇది ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో తమ స్పష్టమైన విధానాన్ని తెలియజేస్తుందన్నారు. ప్రభుత్వ పాత్ర ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం లేనిచోట ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, అదే సమయంలో దేశ ప్రయోజనాలే ప్రాధాన్య అంశంగా నియంత్రణ వ్యవస్థను ప్రభుత్వం నిర్మించిందన్నారు.