న్యూఢిల్లీ: మోదీ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి క్యాబినెట్ సెక్రటేరియట్ ఓ లేఖను రిలీజ్ చేశారు. అత్యంత సరళమైన భాషలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు చేరవేయాలని కేంద్ర మంత్రిత్వశాఖలకు సెక్రటరీ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రెస్ రిలీజ్లను యూజర్ ఫ్రెండ్లీ రూపంలో తయారు చేయాలన్నారు. కఠినమైన పదాలతో ప్రజలకు అర్థం కాని రీతిలో సమాచారాన్ని చేరవేయవద్దు అని, చాలా సరళమైన రీతిలో ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు అందేలా చూడాలని క్యాబినెట్ సెక్రటేరియేట్ తన లేఖలో తెలిపారు. సమాచార వ్యూహాలను అభివృద్ధి పరుచుకోవాలని అన్ని మంత్రిత్వశాఖలను ఆ లేఖలో కోరారు. ప్రజలు ఈజీగా అర్థం చేసుకునే రీతిలో భాషను ఉపయోగించాలన్నారు. ప్రశ్న-సమాధానం రూపంలో క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తే, అది మరింత సులువుగా ప్రజలకు అర్థం అవుతుందన్న అభిప్రాయాన్ని క్యాబినెట్ సెక్రటేరియట్ తన లేఖలో చెప్పారు. ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ సమాచారాన్ని రిలీజ్ చేయాలని అన్ని మంత్రిత్వశాఖలకు ఆదేశాలిచ్చారు. భాష సరళంగా ఉంటే, టార్గెట్ లబ్ధిదారులకు ఆ విషయం చేరుతుందని క్యాబినెట్ సెక్రటరీ తెలిపారు.