ఇండియా విభాగానికి రూ.51 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ, జూలై 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వైఫల్యాలను తరచూ ఎత్తిచూపే ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థపై ఈడీ రూ.51.72 కోట్లు జరిమానా విధించింది. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించినందుకు గాను ఈ పెనాల్టీ వేసింది. అలాగే సంస్థ మాజీ సీఈవో, మానవ హక్కుల కార్యకర్త ఆకార్ పటేల్‌పై కూడా రూ.10 కోట్లు జరిమానా విధించింది.
మాతృ సంస్థ అయిన బ్రిటన్‌లో ఉన్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నుంచి నిధులు పొందడంలో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తున్నది. కాగా, మోదీ ప్రభుత్వం తమ సంస్థను మంత్రగత్తెలా వెంబడిస్తున్నదని, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2020లో వాపోయింది. అందుకే భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం ఆమ్నెస్టీపై కక్ష సాధింపు చర్యలు ఆపలేదు. ఆమ్నెస్టీ ఇండియా సంస్థ విడుదల చేసే నివేదికలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేది. దేశంలో మానవ హక్కుల హరణ ఎలా కొనసాగుతుందో వివరించేది.