న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే దేశంలోని మక్కజొన్న రైతులు నట్టేట మునిగిపోతారంటూ పత్రికల్లో కథనాలు వస్తున్న తరుణంలో భారతీయ మక్కజొన్న మార్కెట్ కుదుపునకు లోనవుతోంది. అమెరికా మక్కజొన్న భారత్‌లో అడుగుపెడితే భారతీయ రైతులు మట్టికొట్టుకుపోక తప్పదంటూ మీడియా కథనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ర్టాలలో మక్క ధరలు పతనమయ్యాయి. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కన్నా దాదాపు రూ. 600 తక్కువ ధర పలుకుతుండడంతో మక్కజొన్న రైతులో భవిష్యత్తుపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరి, అమెరికా మక్కజొన్న భారత్‌లోకి ప్రవేశిస్తే మక్క ధర దారుణంగా పతనమవుతుందని, రైతులు భారీ నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని వార్తాకథనాలు సూచిస్తున్నాయి. మక్క రైతులను మహరాజులను చేస్తామని గతంలో నమ్మబలికిన పాలకులు మక్క పంటను రైతులు ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకుని నష్టాల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రపంచంలో పండించే మొత్తం మక్కజొన్నలో 35 శాతానికి పైగా అమెరికాలోనే పండుతుంది. భారతీయ వాటా కేవలం 3 శాతం మాత్రమే.
మక్కజొన్నకు ఎంఎస్పీని క్వింటాలుకు రూ. 2,400గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి 23 మధ్య మక్క ఎంఎస్పీ సగటు ధర రూ. 1,823.53కి పడిపోయినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏ2+ఎఫ్ఎల్(వాస్తవ ఖర్చులకు అదనంగా కుటుంబ శ్రమ విలువ కలిపి) కింద క్వింటాలు మక్కను పండించడానికి రైతు రూ.1,508 ఖర్చు చేస్తాడు. స్వామినాథన్ కమిషన్ సీ2 ఫార్ములా ప్రకారం చూస్తే రైతు క్వింటాలు మక్కకు రూ. 1,952 ఖర్చు పెడతాడు. దీన్ని బట్టి చాలామంది రైతులు తమ మక్క పంటను నష్టాలకు అమ్ముకుంటున్నట్లు అర్థమవుతుంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మక్క ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయి. అక్కడి రైతులు సగటున రూ. 1,552.49 ధరను మాత్రమే అందుకుంటున్నారు. కొన్ని మండీలలో అయితే ధర ఇంత కన్నా తక్కువకు పడిపోయింది. దేవస్ జిల్లాలోని ఖాటెగావ్ మండీలో క్వింటాలు మక్క ధర రూ.1,196.5కి పడిపోగా సెహోర్‌లోని నస్రుల్లాగంజ్ మండీలో ధర రూ.1,121కి పతనమై రైతులకు పుట్టెడు నష్టాన్ని మిగిల్చింది. దేశంలో పండే మొత్తం మక్కలో 12 శాతానికి పైగా పంట మధ్యప్రదేశ్‌లోనే పండుతుంది. రాజస్థాన్‌లో కూడా క్వింటాలు మక్కకు ఎంస్పీ కన్నా రూ. 700కి తక్కువగా రూ.1695.54 లభిస్తోంది. దేశంలోనే అత్యధికంగా మక్క పండించే రాష్ట్రమైన కర్ణాటకలో గతవారం క్వింటాలకు సగటు ధర రూ. 2,085.85 లభించింది. మహారాష్ట్రలో క్వింటాలుకు రూ. 1,763.85 లభించింది.
గత కొన్ని సంవత్సరాలుగా మక్క రైతులకు లాభాలు వస్తున్న కారణంగా చాలామంది రైతులు ఈ పంటపైనే ఆసక్తి చూపసాగారు. 2020-21లొ 98.92 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మక్కను సాగుచేయగా 2024-25 నాటికి దీని విస్తీర్ణం 120.17 లక్షల హెక్టార్లకు పెరిగింది. అదే కాలంలో మక్క దిగుబడి కూడా 316.45 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 422.81 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగింది. అయితే అమెరికా మక్కను దిగుమతి చేసుకోవడానికి మోదీ ప్రభుత్వం అనుమతించిన పక్షంలో దేశంలో మక్క ధరలు దారుణంగా పతనమై రైతులు ఇక ఆ పంట వేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అదే పరిస్థితి వస్తే భారత్ ఇక మక్క దిగుమతులపై ఆధారపడక తప్పదు. ఇప్పటికే మన దేశం పప్పుధాన్యాలు, నూనె గింజల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.
‘మక్కజొన్నను దిగుమతి చేసుకుంటే మన రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఆహారాన్ని దిగుమతి చేసుకుంటే నిరుద్యోగితను దిగుమతి చేసుకున్నట్లే. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. చవకగా వచ్చే దిగుమతులు దేశీయ ధరలను అణచివేస్తాయి. మక్కను దిగుమతి చేసుకుంటే దేశంలో ఇక మక్కను పండించే రైతులు మిగలరు.’
– వ్యవసాయ ఆర్థికవేత్త దేవీందర్ శర్మ