Donald Trump | న్యూఢిల్లీ, మే 13: భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10వ తేదీ రాత్రి చేసిన ప్రకటన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. అంతేగాక తన మధ్యవర్తిత్వంలోనే కాల్పుల విరమణపై రెండు దేశాలు అవగాహన వచ్చాయని ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో భారత విదేశాంగ విధానమే ప్రశ్నార్థకంగా మారింది. ‘వెయ్యేళ్ల’ తర్వాత కశ్మీరు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు భారత్, పాకిస్థాన్‌తో కలసి తాను కూడా చర్చల్లో పాల్గొంటానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్, పాకిస్థాన్ మధ్య 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం స్ఫూర్తినే దెబ్బతీస్తున్నాయి. అయితే కశ్మీరు వివాదాన్ని ఏదో రకంగా అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్న పాకిస్థాన్‌కు ట్రంప్ ప్రకటన సంతోషాన్ని కలిగించింది. వెంటనే పాక్ పాలకులు ట్రంప్ ప్రకటనను స్వాగతించారు.
జమ్ము కశ్మీర్ వివాదానికి పరిష్కారం కనుగొనడంలో తన వంతు మద్దతు ఉంటుందన్న ట్రంప్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు పాకిస్థాన్ పాలకులు ప్రకటించారు. ట్రంప్ నిర్మాణాత్మక పాత్ర పోషించనున్నారంటూ వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్న తర్వాత ఈ ఉగ్రదాడికి పూర్తి బాధ్యత పాకిస్థాన్ ప్రభుత్వానిదేనని ప్రకటించిన భారత ప్రభుత్వం దాయాది దేశంపై అనేక దౌత్యపరమైన ఆంక్షలను విధించడంతోపాటు సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని సైనిక దాడులు జరిపింది. ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ప్రకటించారు.
సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్థాన్ తమ మధ్య ఉన్న అన్ని వివాదాలను ద్వైపాక్షికంగా మాత్రమే పరిష్కరించుకోవాలి. ఇందులో మూడో పక్షం జోక్యానికి ఏమాత్రం తావులేదు. 2019లో జమ్ము కశ్మీరులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగ సవరణలు చేపట్టిన తర్వాత కశ్మీరు వివాదాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లేవనెత్తేందుకు చైనా, పాకిస్థాన్ ప్రయత్నించినప్పటికీ కశ్మీరు భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసిన భారత్.. సిమ్లా ఒప్పందంలోని ద్వైపాక్షిక నిబంధనను పునరుద్ఘాటించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా తాము సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్థాన్ ఏకపక్షంగా ప్రకటించింది. అయితే భారత్ మాత్రం సిమ్లా ఒప్పందానికి కట్టుబడే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి(మే 12) జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రకటనను ప్రస్తావించకపోవడాన్ని ప్రతిపక్షాలతోపాటు పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు.
అయితే కశ్మీర్ వివాదంపై ట్రంప్ ప్రకటనను రిటైర్డ్ భారతీయ సైనికాధికారి మేజర్ జనరల్ రామేశ్వర్ రాయ్ నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలను అసంబద్ధంగా, చొరబాటుగా ఆయన అభివర్ణించారు. ‘ఈ విషయంలో భారత్ వైఖరికి సంబంధించినంత వరకు భారత్, పాక్ మధ్య కశ్మీర్ ద్వైపాక్షిక అంశం మాత్రమే. దీంతో ప్రపంచానికి సంబంధం లేదు’ అని ‘ది ఇండిపెండెంట్’ పత్రికతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. ‘ట్రంప్‌నకు కూడా దీంతో సంబంధం లేదు. ఆయన జోక్యాన్ని ఏ సమయంలోనూ కోరుకోము. జమ్ము కశ్మీరులో మూడోపక్షం జోక్యాన్ని మనం ఎన్నడూ కోరలేదు.. కోరబోము’ అని రాయ్ తెలిపారు. భారతీయ అధికారులు కూడా విదేశీ వ్యాఖ్యలకు లేదా విదేశీ జోక్యానికి కశ్మీర్ అతీతమని పునరుద్ఘాటిస్తున్నారు. ‘భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదు. ఏ మధ్యవర్తి అవసరం మాకు లేదు’ అని భారతీయ అధికారి ఒకరు ఇండియాటుడేకు తెలిపారు. అయితే ట్రంప్ ప్రకటనతో భారత్‌లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని లండన్‌లోని కింగ్స్ కాలేజ్ విజిటింగ్ ప్రొఫెసర్ హర్షణ పంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడో పక్షానికి దీంతో సంబంధం లేదన్నది భారతదేశ విధానమని ది ‘ఇండిపెండెంట్’ పత్రికకు ఆయన తెలిపారు. కశ్మీర్ వ్యవహారంలో తలదూర్చడానికి ఏ దేశమైనా ప్రయత్నిస్తే భారత్ వ్యతిరేకించక తప్పదని ఆయన చెప్పారు.
గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్ వ్యూహాత్మకంగా కొంత వెనుకబడినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మద్దతు ఇచ్చిన దేశాల సంఖ్య పాక్‌తో పోలిస్తే స్వల్పంగా ఉందని, అంతర్జాతీయ మీడియా కవరేజీలో కూడా భారత్ వెనుకబడి ఉందని వారు తెలిపారు. పాకిస్థాన్ పక్షాన చైనా బలంగా నిలువగా తుర్కియే, అజర్బైజాన్ బహిరంగ మద్దతు ప్రకటించాయి. తుర్కియే డ్రోన్లతో భారత్‌పై పాక్ విస్తృతంగా దాడులు జరిపింది. ఫ్రాన్స్ తటస్థంగా ఉండిపోయింది. అక్కడి నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ విమానాల ప్రభావం రష్యాకు చెందిన ఎస్-400 పనిచేసినంతగా పనిచేయలేదు. భారత్‌కు రష్యా మద్దతు ప్రకటించినప్పటికీ సంయమనం పాటించాలని రెండు దేశాలను కోరింది. పాకిస్థాన్ జిహాదీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నదన్న వాస్తవం ప్రపంచ దేశాలకు తెలిసినప్పటికీ భారత్‌కు మాత్రం ఆశించినంత మద్దతు లభించలేదని విశ్లేషకులు తెలిపారు.
అంతర్జాతీయ దృష్టికి కశ్మీర్ సమస్యను తీసుకురావడానికి పాకిస్థాన్ ఎంతోకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు ట్రంప్ వ్యాఖ్యలు ఊతమిచ్చాయని కొందరు విమర్శకులు వాదిస్తున్నారు. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడమే పాకిస్థానీ విదేశాంగ విధానం ప్రధాన లక్ష్యమని, ఇప్పుడు అదే కచ్చితంగా జరిగిందని వాషింగ్టన్కు చెందిన దక్షిణాసియా విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మేన్ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. వివాదం పరిష్కారం అయిపోయిందని భావిస్తున్న భారత ప్రభుత్వానికి ఈ పరిణామం ఇబ్బందికరమేనని ఆయన చెప్పారు. తన వ్యూహాత్మక లక్ష్యాన్ని పాకిస్థాన్ సాధించేందుకు ట్రంప్ వ్యాఖ్యలు పరోక్షంగా దోహదపడ్డ మాట వాస్తవమేనని మేజర్ జనరల్ రాయ్ ఒప్పుకున్నారు. ‘కశ్మీర్‌ను ప్రపంచ వ్యవహారాలలో కేంద్ర స్థానంగా ముఖ్యంగా అమెరికా దృష్టిని ఆకర్షించడంలో పాకిస్థాన్ సఫలీకృతమైంది. ఏప్రిల్ 22 నుంచి పెరుగుతున్న సంక్షోభ కాలంలో పాకిస్థాన్ సాధించిన విజయాలలో ఇది కూడా ఒకటి’ అని మేజర్ జనరల్ రాయ్ అభిప్రాయపడ్డారు. అయితే, దేశంలోని ప్రతిపక్ష నాయకులకు ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు ట్రంప్ వ్యాఖ్యలు బలమైన ఆయుధంగా మారాయి. ‘తృతీయ పక్షం మధ్యవర్తిత్వానికి మనం తలుపులు బార్లా తెరిచామా’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. కాల్పుల విరమణపై భారత్‌లో కొంత అసంతృప్తి ఉందని, దీనికి కారణం ఎక్కడి నుంచో హఠాత్తుగా ఊడిపడిన ట్రంప్ ఈ ప్రకటన చేయడమేనని బీజేపీకి చెందిన మాజీ ఎంపీ స్వపన్‌దాస్ గుప్తా వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన భారత్‌ను నాలుగు విధాలుగా తీవ్ర నిరాశకు గురిచేస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు.
1.బాధితుడిని, నేరస్థుడిని సమాన దృష్టితో చూసేలా ఇది ఉంది. పాకిస్థాన్ గత చరిత్ర క్షుణ్ణంగా తెలిసిన అమెరికా గతంలో పాక్ పట్ల తీసుకున్న వైఖరికి ఇది పూర్తి భిన్నం.
2.పాకిస్థాన్‌కు చర్చలో పాల్గొనే అవకాశాన్ని ట్రంప్ కల్పించడం. పాకిస్థాన్‌కు ఇప్పటికీ ఆ అర్హత రాలేదు. తన తలపైన తుపాకీ పెట్టిన ఉగ్రవాదితో భారత్ ఎన్నటికీ చర్చలు జరపదు.
3.ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యమైన కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయం చేయడానికి ట్రంప్ ప్రకటన దోహదం చేస్తున్నది. దీన్ని వివాదంగా చూసేందుకు భారత్ ఇష్టపడడం లేదు. ఇది భారతదేశ అంతర్గత వ్యవహారంగానే భారత్ చూస్తున్నది.
4.ప్రపంచం దృష్టిలో భారత్, పాకిస్థాన్‌ను సమానంగా చూపే ప్రయత్నం చేయడాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదు. అనేక దశాబ్దాలుగా ప్రపంచ నాయకులు ఎవరూ తమ సందర్శనలలో భారత్, పాకిస్థాన్‌ను జోడించేవారు కాదు. అయితే 2000లోఅమెరికా అధ్యక్షుడు క్లింటన్‌తో ఇది మొదలైంది. గతంలో ఏ అధ్యక్షుడు ఇలా చేయలేదు. ఇది చాలా పెద్ద తిరోగమన చర్య.