న్యూఢిల్లీ, జూన్ 12 : మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇండియా టుడే టీవీకి గురువారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2027లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ నిర్వహిస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రకటించింది. మొట్టమొదటిసారి ఇందులో కులగణన కూడా భాగం కానున్నది. ఇది రెండు విడతలుగా జరగనున్నది.
హిమపాతం అధికంగా ఉండే పర్వత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్ము కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ర్టాలలో 2026 అక్టోబర్లో, మిగిలిన రాష్ర్టాలలో 2027లో ఈ ప్రక్రియ జరగనున్నది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించనున్నారు. రెండేళ్లలో జనాభా లెక్కల సేకరణ పూర్తవుతుందని, తాజా జనాభా గణాంకాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ అధినియం లేక మహిళా రిజర్వేషన్ బిల్లు, 2023కు అనుగుణంగా 33 శాతం రిజర్వేషన్ కోటా అమలు అవుతుంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల సేకరణ ఆధారంగా అమలులోకి వస్తుంది.
దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడు 1996లో మొదటిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు మారిన అనేక ప్రభుత్వాలను, చర్చలను వీక్షించి 27 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఆమోదం పొందింది. ఈ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం అమలులోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల పాటు మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలలో ఎటువంటి మార్పులు ఉండవు.
జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై అధికార ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. చివరిసారి 2011లో 15వ జనాభా లెక్కల సేకరణ జరిగింది. తిరిగి 2021లో జరగవలసి ఉండగా కొవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కాగా, నియోజకవర్గాల పునర్విభజన దేశంలో 1952, 1963, 1973, 2002లో జరిగింది. సామాన్య పౌరుల భాషలో చెప్పాలంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తాజా జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులను మార్చి సంఖ్యను పెంచడం. ఎంపీ లేక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చూడాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ర్టాలు సంతృప్తిగా లేవు.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పలు సందర్భాలలో దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ర్టాలలో లోక్సభ స్థానాల సంఖ్య యథాప్రకారం ఉన్న పక్షంలో ఉత్తరాది రాష్ర్టాలు, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి మధ్య భారత రాష్ర్టాలు ప్రయోజనం పొందుతాయని నిపుణులు తెలిపారు. ఈ రాష్ర్టాలు సుమారు 31 స్థానాలు అదనంగా పొందవచ్చని, అదే సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షణాది రాష్ర్టాలు సుమారు 26 స్థానాలను కోల్పోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ తేడాకు ఉత్తరాది రాష్ర్టాలు, మధ్య భారతంలోని రాష్ర్టాలలో జనాభా పెరుగుదల అత్యంత వేగంగా ఉండడమే ఇందుకు కారణమని వారు తెలిపారు.