(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నిసాైర్లెనా మొర పెట్టుకోండి. మేం మాత్రం స్పందించం’ అనే విధంగా కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. అదానీ (Adani) గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడటం కోసం బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC)కు పేరు ఉన్నది. అలాంటి సంస్థ ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదుసార్లు చేసిన విజ్ఞప్తులను కూడా మోదీ ప్రభుత్వం పక్కనబెట్టింది.
ఈ మేరకు న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జేమ్స్ ఆర్ చో ముందు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కౌన్సిల్ క్రిస్టోఫర్ ఎం కొలొరాడో శుక్రవారం వాపోయారు. రూ.2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీకి సమన్లు జారీ చేయడానికి భారత్లోని మోదీ సర్కారు నుంచి ఎటువంటి సహాయ సహాకారాలు లభించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమన్ల జారీకి భారత అధికారుల నుంచి సహాయం కోసం గడిచిన 13 నెలలుగా తాము ఎదురు చూస్తున్నామని, నోటీసుల జారీలో సాయం చేయాల్సిందిగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. వారి నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసులో అదానీని కాపాడేందుకు స్వయంగా మోదీనే రంగంలోకి దిగారా? అనే అనుమానాలను పలువురు విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.
హేగ్ సర్వీస్ ఒప్పందం ప్రకారం.. ఏదైనా కేసు విషయంలో భారత్లో నివసిస్తున్న ప్రతివాదులకు సమన్లు ఇవ్వాలంటే ఆ సమన్లతో పాటు ఫిర్యాదు ప్రతిని కూడా జారీ చేయాల్సి ఉంటుందని కొలొరాడో ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. ఈ కేసులో ప్రతివాదులకు (గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ) సమన్లు, ఫిర్యాదును అందచేయడానికి భారత న్యాయ శాఖ సాయాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. అదానీలు, వారి న్యాయవాదులకు తమనుంచైతే లా సూట్, సమన్లు, ఫిర్యాదు ప్రతులను గడిచిన 8 నెలల కాలంలో ఐదుసార్లు పంపించినట్లు కోర్టుకు సమర్పించిన తాజా స్టేటస్ రిపోర్టులో ఎస్ఈసీ పేర్కొంది. తాము ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, భారత న్యాయ శాఖ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని ఎస్ఈసీ వాపోయింది.
గౌతమ్ అదానీకి సమన్లను జారీ చేయడానికి మోదీ ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించట్లేదని ఎస్ఈసీ ఆరోపించడంపై రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున దుమారం రేగుతున్నది. బొగ్గు గనుల నుంచి పోర్టుల వరకు, రిటైల్ వ్యాపారం నుంచి విమానాశ్రయాల వరకు మొత్తంగా దేశాన్నే అదానీకి గంపగుత్తగా కట్టబెట్టిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు అమెరికాలో దాఖలైన కేసు నుంచి అదానీని తప్పించడానికి ఇలా చేస్తున్నదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన నేరారోపణలు రుజువైతే ఆయన్ని భారత్.. అమెరికాకు అప్పగించాల్సిందేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అందుకే, అదానీకి సమన్లను జారీ చేయడానికి మోదీ ప్రభుత్వం ఎస్ఈసీకి సహకరించట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. అదానీని కాపాడేందుకే, మోదీ ప్రభుత్వం ఇలా చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.