PM Modi | న్యూఢిల్లీ, నవంబర్ 11: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలవేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నానా తంటాలు పడుతున్నది. ఆయా రాష్ర్టాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు ‘ఆపద మొక్కుల’ను నమ్ముకున్నారని తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిన ప్రధాని మోదీ, ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేండ్లు (2028 వరకు) అమలుజేస్తామని ప్రకటించారు. దీనివల్ల 80 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఎన్నికలు..ఓట్లు లేకపోతే ప్రధాని మోదీ నుంచి ఈ ప్రకటన వచ్చేదే కాదు. అత్యంత అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెబుతూనే, మరోవైపు 80 కోట్లమంది ఆకలిని తీర్చేందుకు ఉచిత రేషన్ అమలుజేస్తామని చెప్పటం విమర్శలకు దారితీసింది.
అమృత్ కాలంలో, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో దేశ ప్రజలకు పెద్దగా ఒనగూడిందేమీ లేదు. రేపటినాడు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తే..పేద ప్రజలకు వచ్చేది ఏముంటుందన్నది సామాన్యుడి ప్రశ్న. 80 కోట్లమంది ప్రజలు ఉచిత బియ్యం లేదా గోధుమల కోసం చేతులు చాచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది కేంద్రం చెప్పటం లేదు. మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాల ఫలితంగానే దేశం నేడు ప్రపంచ ఆకలి సూచిక-2023లో 111 నుంచి 125కు దిగజారింది. ఉపాధి, ఉద్యోగాల్లో, పేదరిక నిర్మూలనలో..ఇలా దేంట్లో చూసినా భారత్ ర్యాంకులు నేల చూపులు చూస్తున్నాయి. జీవన వ్యయం పెరిగి ప్రజల జేబు గుల్లవుతున్నది. అయినా..మోదీ సర్కార్, బీజేపీ సోషల్ మీడియా గ్రూపులు ‘భారత్ ఆర్థికంగా వెలిగిపోతున్నది’ అన్న ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.