న్యూఢిల్లీ, అక్టోబర్ 2: తాను విమర్శలను ఎంతగానో గౌరవిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. దురదృష్టవశాత్తూ విమర్శకుల సంఖ్య రానురాను తగ్గిపోతున్నదని, ఆరోపణలు చేసేవాళ్లు పెరుగుతున్నారని అన్నారు. విమర్శకులు తగ్గిపోవడం బాధగా ఉందన్నారు. ఓపెన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీ అయినా.. ‘మేం ఏం చేస్తే మళ్లీ గెలుస్తాం’ అన్న ఆలోచనతోనే పరిపాలన చేసే సంప్రదాయం భారతదేశంలో ఉన్నదని చెప్పారు. కానీ తన తీరు మాత్రం వేరని, మళ్లీ అధికారం కోసం కాక దేశానికి ఏం చేస్తే మంచిదో అదే తమ ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే కఠినమైన, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోక తప్పదని చెప్పారు. ప్రస్తుతం సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నవారిని చూస్తే మేధోపరమైన కపటత్వం, రాజకీయ వంచనకు అర్థం తెలుస్తుందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. గతంలో ఆ పార్టీ కూడా ఇదే తరహా సంస్కరణలు తెస్తామని ప్రకటించిందని, అప్పటి సీఎంలకు లేఖలను రాసిందని చెప్పారు. కొత్త సాగు చట్టాలను దశాబ్దాల క్రితమే తీసుకురావాల్సిందని, రైతులు ఆ ఫలాలను కోల్పోయారని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ విధానం వల్లే ఈ రోజు టీకా పంపిణీలో భారత్ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. చాలా దేశాలకు టీకాలు అందుబాటులో లేవని తెలిపారు.
5 కోట్లకు పైగా నల్లా కనెక్షన్లు
జల్ జీవన్ మిషన్ యాప్‌ను శనివారం మోదీ ప్రారంభించారు. దీంతోపాటు రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జల్ జీవన్ మిషన్‌లో రెండేండ్లలోనే 1.25 లక్షల గ్రామాల్లో 5 కోట్లకు పైగా నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు.