Mallikarjun Kharge | ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్‌దేనని, దాంతోనే నరేంద్రమోదీ, అమిత్‌షా వంటి వ్యక్తులు ప్రధాని, హోంమంత్రి పదవులను చేపట్టగలిగారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో (unite India) గురించి మాట్లాడుతుంటే.. మోదీ భారత్ తోడో (divide India) అని నమ్ముతున్నారన్నారు. మణిపూర్ హింసాత్మకంగా మారి మూడు నెలలవుతున్నా ప్రధాని పర్యటించలేని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యాక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని మోదీ చాలాసార్లు విమర్శించారన్నారు.
మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి. వీపీసింగ్, హెడీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానులుగా పని చేశారన్నారు. తాము ప్రజాస్వామ్యాన్ని రక్షించామని, రాజ్యాంగాన్ని రక్షించామని, మోదీ ప్రధాని కావడానికి ఇదే కారణమన్నారు. అమిత్ షా కూడా కేంద్ర హోంమంత్రి అయ్యారని.. లేకపోతే ఇద్దరూ గుజరాత్లో ఉండిపోయేవారన్నారు. వ్యక్తి అహంకారం ఎప్పుడూ ప్రమాదకరమేనన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఎర్రకోటపై జెండా ఎగురవేస్తానని మరోసారి మోదీ ప్రగల్భాలు పలికారని విమర్శించారు.
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ గురించి ప్రధాని మాట్లాడుతున్నారన్న ఖర్గే.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ త్యాగాలు చేశారన్నారు. మణిపూర్ కాలిపోతున్నా ప్రధాని అక్కడికి వెళ్లలేదని.. సమస్యపై పార్లమెంట్లో మాట్లాడాలని కోరామని.. కానీ ఆయన రాజ్యసభకు రాలేదన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లోక్‌సభకు వచ్చారని ఆరోపించారు. ఎర్రకోటపై మణిపూర్‌పై కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారని దుయ్యబట్టారు. రాహుల్ అనర్హత వేటుపడిన తర్వాత సామాన్యుడిలా ప్రజల బాధలను తెలుసుకునేందుకు వెళ్లారని, కానీ ఆయనను అడ్డుకున్నారన్నారు. దీనిపై చర్చకు సిద్ధంగా లేరని.. మహిళలను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు.