Crime News : కేంద్ర రక్షణశాఖ (Ministry of Defence) కు చెందిన అధికారిణి ఢిల్లీ (Delhi) లోని తమ నివాసంలో ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. రక్షణశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (Assistant Section Officer) గా పనిచేస్తున్న నాజియా ఖానమ్ (Naziya Khanam) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేకే తన కుమార్తె మృతిచెందిదని మృతురాలి తండ్రి తవాబ్ ఖాన్ (Tawab Khan) ఆరోపించారు.
ఏప్రిల్ 11 2026న ఆజమ్ అలీ ఖాన్‌తో తమ కుమార్తె నాజియాకు వివాహం జరిపించామని, పెళ్లి అయిన వారం నుంచే వారు వేధిస్తున్నారని తమకు చెప్పిందని పేర్కొన్నారు. ఆమె భర్తే తమ కుమార్తెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని.. ఈ విషయాన్ని తమ కుమార్తె పలుమార్లు చెప్పిందని తవాబ్ ఖాన్ తెలిపారు. అత్తమామలు తరచూ తిడుతున్నారని, కట్నం తేవాలని బలవంతం చేస్తున్నారని చెప్పి బాధ పడిందన్నారు.
కొద్ది రోజుల తర్వాత వెళ్లి మాట్లాడదామనున్నామని, అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తవాబ్ ఖాన్ తెలిపారు. తమ కుమార్తె మూడు నెలల గర్భవతి అని చెప్పారు. తమ అల్లుడి తండ్రి మాజీ పోలీసు అధికారి కావడంతో ఢిల్లీ పోలీసులు కూడా ఈ కేసును బయటకు రాకుండా చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే నాజియానే ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త పోలీసులకు వెల్లడించారు. శుక్రవారం తమ మధ్య వాగ్వాదం జరిగిందని, దాంతో నాజియా మరో గదిలోకి వెళ్లి తలుపేసుకుందని పేర్కొన్నారు.
కొద్ది సేపటి తర్వాత వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించిందన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.