కోల్‌కతా: ఇంట్లో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి కత్తితో పొడిచి భార్యను హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా కత్తితో గాయపర్చాడు. ఆ తర్వాత అతడు పురుగుల మందు తాగాడు. దాడి చేసిన కత్తితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. (Man Stabs Wife) పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రుక్సానా బేగం, జహంగీర్ ఆలం భార్యాభర్తలు. మూడేళ్ల కిందట వారికి వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.
కాగా, శనివారం ఉదయం 6 గంటల సమయంలో భార్య రుక్సానా బేగంతో జహంగీర్‌కు ఒక విషయంపై వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అతడు పదునైన కత్తితో భార్యను పలుమార్లు పొడిచాడు. జహంగీర్ తల్లి జోక్యం చేసుకుని రుక్సానాను కాపాడేందుకు ప్రయత్నించింది. అయితే తన తల్లిపై కూడా కత్తితో అతడు దాడి చేశాడు. కాలికి తీవ్ర గాయమై రక్తం కారడంతో ఆమె ఇంటి నుంచి బయటకుపరుగెత్తింది.
మరోవైపు కేకలు విన్న స్థానికులు జహంగీర్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తీవ్ర కత్తి గాయాలపాలైన రుక్సానా మరణించింది. ఆ తర్వాత జహంగీర్ పురుగుమందు తాగాడు. దాడి చేసిన పదునైన కత్తితో ధూప్‌గురి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రుక్సానా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జహంగీర్ తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
అయితే జహంగీర్ మత్తుపదార్థాలకు బానిసయ్యాడని, డ్రగ్స్ సేవించి ఇంట్లో గొడవలు సృష్టించేవాడని స్థానికులు ఆరోపించారు. భార్యను కొట్టడమే కాకుండా పొరుగువారిని కూడా బెదిరించేవాడని పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలో జహంగీర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేరానికి అసలు కారణంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్రిక్తత నివారించేందుకు ఆ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ బృందాన్ని మోహరించినట్లు వివరించారు.