ముంబై, జూలై 9 ( నమస్తే తెలంగాణ): అధికారం ఉంది కదా.. అని మహారాష్ట్రలో శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఓ హోటల్ కార్మికుడిపై దాడికి దిగాడు. ముంబై, చర్చిగేట్లోని ఎమ్మెల్యేల క్యాంటిన్లో తనకు వడ్డించిన ఆహారం రుచిగా లేదని, కుళ్లిపోయిందని ఆరోపిస్తూ క్యాంటిన్ కార్మికుడు, మేనేజర్, ఇతర సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదల కాగా, ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. మహారాష్ట్ర అసెంబ్లీ, విధాన సభలో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు, శివసేన (ఉద్ధవ్) వర్గం లేవనెత్తాయి.
అధికారం అతడి (సంజయ్ గైక్వాడ్) తలకెక్కిందని ఆదిత్య ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ గైక్వాడ్ తీరును సమర్థించటం లేదని ఏక్నాథ్ షిండే అన్నారు. దోషులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. దాడికి సంబంధించి తన ప్రవర్తనపై ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ విచారం వ్యక్తం చేయలేదు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదూ నమోదు కాలేదు. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాల్లో చిక్కుకుకోవటం కొత్తేమీ కాదు. గతేడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ నాలుకను కోసిన వారికి రూ.11 లక్షల బహుమతి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ పోలీసు అధికారి గైక్వాడ్ కారును కడగడం కనిపించింది.