పాట్నా, అక్టోబర్ 11: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే మిశ్రిలాల్ యాదవ్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు. అలీనగర్ ఎమ్మెల్యే, ప్రముఖ ఓబీసీ నేతగా పేరొందిన ఆయన పార్టీలో జరుగుతున్న అవమానం కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘బీజేపీలో ఉండటం మేము అవమానంగా భావిస్తున్నాం. పార్టీలో మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. అవమాన పరుస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు’ అని పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆరోపించారు. బీజేపీలో దళితులు, ఓబీసీలకు వారి హక్కులు లభించడం లేదని ఆయన విమర్శించారు.
గత 30 ఏండ్లుగా ఏ ఒక్క ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించని స్థానంలో తాను 2020లో ఎమ్మెల్యేగా నెగ్గానని, అయినప్పటికీ తనను పార్టీ గౌరవించడం లేదన్నారు. కాగా, యాదవ్ ఆ ఎన్నికల్లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మిశ్రిలాల్ సహా మిగిలిన నలుగురు వీఐపీ పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత బీజేపీలో చేరారు. కాగా, యాదవ్ ప్రస్తుతం ఏ పార్టీలో చేరేదీ వెల్లడించ లేదు. ఆయన ఆర్జేడీ ప్రధాన పార్టీగా ఉన్న ఇండియా కూటమిలో చేరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే తాను మళ్లీ అలీనగర్ నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు.