కోచి : ఒక నటిని రేప్ చేశారన్న ఆరోపణల కేసులో కేరళ అధికార పార్టీ ఎమ్మెల్యే, నటుడు ముఖేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అధికారికంగా అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనను బెయిల్‌పై విడుదల చేసింది. అంతకు ముందు సిట్ హెడ్‌క్వార్టర్స్‌కు దర్యాప్తు నిమిత్తం ఉదయం 9.45 గంటలకు వెళ్లిన ఆయనను అధికారులు మూడున్నర గంటల పాటు ప్రశ్నించి, అనంతరం అరెస్ట్ చేశారు. అయితే ఆయనపై దాఖలైన కేసులో ఎర్నాకుళం జిల్లా సెషన్స్ జడ్జి ఈ నెల 5న బెయిల్ మంజూరు చేశారు. కాగా, మరో లైంగిక దాడి కేసులో ముకేశ్‌కు కేరళ హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2010లో త్రిసూర్ జిల్లా వడక్కడెరీలో తనను లైంగికంగా వేధించినట్టు మొదటి కేసులోని నటే ముకేశ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో రెండు కేసుల్లో ఆయనకు అరెస్ట్ నుంచి మినహాయింపు లభించింది.
మలయాళ నటిపై లైంగిక దాడి కేసులో నటుడు సిద్ధిఖీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. తాను రేప్ చేసినట్టు ఆ నటి చేసిన ఆరోపణలు నిజం కాదని, గత ఐదేండ్లుగా తనను ఆమె బెదిరిస్తున్నట్టు సిద్ధిఖీ న్యాయస్థానానికి తెలిపారు.