చెన్నై, ఆగస్టు 8 : హిందీ పాలసీకి వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్రిభాషా సూత్రంపై కేంద్రంతో తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో విద్యా విధానాన్ని మార్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర విద్యా విధానం (ఎస్ఈపీ)ని తెచ్చారు. శుక్రవారం కొట్టుర్పురంలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు తెచ్చిన ఈ విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పాలసీ ముసాయిదా ఏర్పాటుకు 2022లో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఈ కమిటీ తన సిఫార్సులతో కూడిన నివేదికను గత ఏడాది జూలైలో ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం ఈ నివేదికను ఇప్పుడు అధికారికంగా విడుదల చేసింది.
కొత్త ఎస్ఈపీ ప్రకారం రాష్ట్రంలోని విద్యా సంస్థలలో కేంద్రం త్రి భాషా సూత్రాన్ని తిరస్కరించి రాష్ట్రంలోని రెండు భాషల విధానాన్ని యథావిధిగా ఉంచుతారు. అంతేకాకుండా ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 11, 12 తరగతుల్లో వచ్చిన ఏకీకృత మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 3, 5, 8 తరగతుల వారికి పబ్లిక పరీక్షలు నిర్వహించాలన్న ఎన్ఈపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఇది తిరోగమన విధానమని పేర్కొంది. అంతేకాకుండా సామాజిక న్యాయానికి ఇది వ్యతిరేకమని, విద్యార్థులు డ్రాపవుట్లు బాగా పెరిగే అవకాశం ఉందని, విద్య వాణిజ్యీకరణ అవుతుందని కమిటీ అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్వహణలోని విద్యా సంస్థలపై గణనీయమైన పెట్టుబడులు పెట్టడంతో పాటు సైన్స్, ఇంగ్లిష్, కృత్రిమ మేధలాంటి కోర్సులకు మంచి ప్రోత్సాహం కల్పించాలని కోరింది.