చెన్నై, నవంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దక్షిణ, ఉత్తరాది రాష్ర్టాల అభివృద్ధిపై చర్చకు తెరలేపారు. ఉత్తరాది కన్నా దక్షిణ రాష్ర్టాలే అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు. తమిళనాడు నేతృత్వంలో దక్షిణాది రాష్ర్టాలు గణనీయమైన ఆర్థిక ప్రగతిని సాధించి దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషించడమే కాక, తద్వారా ఆ ప్రగతి ఫలాలు ఉత్తరాది రాష్ర్టాలకు అందజేస్తూ దన్నుగా ఉన్నట్టు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
తమిళనాడు రాష్ట్రంలో చేపట్టిన కొంగు బెల్టు యాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురైను ప్రస్తావిస్తూ ఉత్తరాది వర్థిల్లుతున్నప్పుడు.. దక్షిణాది క్షీణిస్తుందని ఆయన అనేవారని, అయితే ఇప్పుడు దక్షిణాది అభివృద్ధితో విలసిల్లుతున్నదని 20 26లో తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.