చెన్నై: తమిళనాడులోని ఆలయ ఆస్తులను చోరీ చేసి విదేశాలకు విక్రయిస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పందించారు. డీఎంకే నేతృత్వంలోని ద్రవిడ మోడల్ ప్రభుత్వం రూ.5,500 కోట్ల విలువైన ఆలయ ఆస్తులను రికవరీ చేసిందని తెలిపారు. శుక్రవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘వారి(బీజేపీ)కి భక్తి ఉంటే ఈ ఆస్తులను తిరిగి పొందినందుకు డీఎంకే ప్రభుత్వాన్ని అభినందించాలి. అయితే వారి భక్తి కేవలం ప్రజలను మోసం చేసేందుకు రూపొందించిన పగటిపూట చర్య’ అని అన్నారు.
కాగా, హిందువుల ఓట్లు తమకు అవసరం లేదని తాను చెప్పినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు చేసిన రిటైర్డ్ పోలీసు అధికారిపై కేసు నమోదు చేసినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ద్రవిడ మోడల్ ప్రభుత్వం పరువు తీయడానికి, పడగొట్టడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నందున ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. రాబోయే ఎన్నికలను సద్వినియోగం చేసుకొని వారి(బీజేపీ)కి గుణపాఠం చెప్పాలని తమిళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.