MK Stalin : కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొక్కిసలాటపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ను నియమించినట్లు తెలిపారు. కమిషన్ విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని, ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
అంతకుముందే అంటే శనివారం రాత్రి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం స్టాలిన్ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కరూర్ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటివరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు. ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం అందిస్తాం’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
రాజకీయ ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, విచారణలో నిజాలు బయటకు వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్టాలిన్ చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ప్రచారసభలో శనివారం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు.