చెన్నై: ఏటీఎంల నుంచి నెలవారీ పరిమితికి మించి జరిపే నగదు ఉపసంహరణలపై చార్జీలు విధించేందుకు బ్యాంకులను అనుమతిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపట్టారు. ఇది డిజిటైజేషన్ కాదని, ప్రజల నుంచి సంస్థాగతంగా డబ్బును వసూలు చేసుకోవడమని విమర్శించారు. దీనివల్ల ప్రజలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ నగదును ఉపసంహరించుకుంటారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు తెరవాలని కోరిన కేంద్ర ప్రభుత్వం.. డిజిటల్ లావాదేవీలపై చార్జీలు, బ్యాంకు ఖాతాల్లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి జరిమానాలు విధిస్తున్నదని, మరోవైపు ఏటీఎంల నుంచి నెలవారీ పరిమితికి మించి జరిపే నగదు ఉపసంహరణలపై బ్యాంకులు రూ.23 వరకు చార్జి విధించేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతించిందని స్టాలిన్ ధ్వజమెత్తారు.