Madhusudan Mistry | గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోను శనివారం అహ్మదాబాద్‌లో విడుదల చేసింది. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు రైతుల రుణమాఫీ, ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తాం వంటి హామీలను మ్యానిఫెస్టోలో గుప్పించింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వాగ్దానాల కంటే ఎక్కువగా వివాదాలు కనిపిస్తుండటం విశేషం.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుసూదన్ మిస్త్రీ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని వెల్లడించారు. అదేవిధంగా బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసు దోషుల విడుదలను రద్దు చేసి వారిని తిరిగి జైలుకు పంపుతామన్నారు. నరేంద్ర మోదీ ఏనాటికీ పటేల్ కాలేరని వ్యంగ్యంగా అన్నారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రభుత్వ రిక్రూట్మెంట్లో అవినీతి, తరచుగా పేపర్ లీక్‌లను నిరోధించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు నిరుద్యోగులకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్య ఫీజులను 20 శాతం తగ్గించడంతోపాటు ఇతర సర్వీస్ ఛార్జీలను రద్దు చేస్తామని మిస్త్రీ వెల్లడించారు.