ఇంపాల్: మణిపూర్‌లో మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు(Manipur Students) శవమై తేలారు. జూలైలో ఆచూకీలేకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఇద్దరి మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. 17 ఏళ్ల హిజామ్ లింతోయింగంబి, 20 ఏళ్ల ఫిజమ్ హేమ్‌జిత్ .. సాయుధుల మధ్య ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ చనిపోయినట్లు ఉన్నట్లు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఓ జంగిల్ క్యాంపు వద్ద ఆ ఇద్దరూ హతమైనట్లు తెలుస్తోంది. జూలై నుంచి అదృశ్యమైన ఆ ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు జరుగుతోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది.
లింతోయింగంబి తెల్ల టీషర్ట్‌లో ఉంది. ఇక హేమ్‌జిత్ చెక్స్‌తో ఉన్న టీషర్ట్‌లో ఉన్నాడు. ఆ ఇద్దరు ఉన్న ఫోటోలో మరో ఇద్దరు వ్యక్తులు చేతుల్లో గన్స్‌తో ఉన్నారు. మరో ఫోటోలో ఆ ఇద్దరు విద్యార్థులు విఘత జీవులై పడి ఉన్నారు. జూలై నుంచి ఈ కేసులో దర్యాప్తు సాగుతున్నా.. ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ విద్యార్థులు షాపుల మధ్య తిరుగుతున్నట్లు సీసీటీవీల్లో గుర్తించారు. కానీ వాళ్ల ఆచూకీని మాత్రం పట్టుకోలేకపోయారు. సైబర్ ఫోరెన్సిక్ టూల్స్ ద్వారా ఆ సాయుధుల్ని గుర్తించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను గుర్తించామని, ఇప్పటికే ఆ కేసును సీబీఐకి అప్పగించామని మణిపూర్ ప్రభుత్వం పేర్కొన్నది.
ఆ విద్యార్థుల్ని ఎవరు హత్య చేశారన్న కోణంలో దర్యాప్తు జరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలిపారు. విద్యార్థుల్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.