Sayli Surve | మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సుర్వే అదృశ్యమయ్యారు. ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా ఇస్లాం నుంచి తిరిగి హిందూ మతంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. పుణేలోని పింప్రి – చించ్వాడ్లో సుర్వేతో పాటు ఆమె నలుగురు పిల్లలు కనిపించకుండా పోవడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
తమ కుమార్తెను అత్తింటి వారే కిడ్నాప్ చేశారంటూ సయాలీ సుర్వే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పింప్రి-చించ్వాడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
సయాలీ సుర్వే కొన్నాళ్ల క్రితం మీరా-భయందర్కు చెందిన ముస్లిం వ్యాపారవేత్త ఆతిఫ్ తాసెను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా అతడినే వివాహం చేసుకుని వెళ్లిపోయింది. ఈ వివాహం కోసం ఆమె ఇస్లాం మతంలోకి కూడా మారింది. తన పేరును అతీజా తాసే అని మార్చుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆతిఫ్తో వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఇటీవల సుర్వే బయటపెట్టింది. తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు ఆతిఫ్ను పెళ్లి చేసుకోవడమే అని తెలిపింది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని బయటపెట్టింది. కానీ తన పిల్లల కోసమే వాటన్నింటినీ భరించానని తెలిపింది.
చివరకు ఆ బంధాన్ని తెగదెంపులు చేసుకున్నానని సుర్వే తెలిపింది. తాజాగా పింప్రి-చించ్వాడ్లో నిర్వహించిన ఘర్ వాపసీ కార్యక్రమంలో సయాలీ సుర్వే తిరిగి హిందూమతంలోకి మారింది. తన పేరును ఆద్య సుర్వే మార్చుకుంది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, హిందూ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితులను ఎవరూ భరించకూడదని సూచించింది. తాను కూడా చాలాకాలం సహించిన తర్వాతే బయటకు వచ్చేశానని తెలిపింది.
ఘర్ వాపసీ కార్యక్రమం తర్వాత పుట్టింటికి చేరుకున్న కొద్దిరోజులకే సయాలీ, ఆమె నలుగురు పిల్లలు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. వెంటనే ఆమెను కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, సయాలీ అత్త గుల్షన్ తాసే మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.