బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెళగావిలో మైనర్ బాలికపై ఆరుగురు మృగాళ్లు రెండు నెలల్లో రెండుసార్లు లైంగికదాడి చేశారు. పోలీస్ కమిషనర్ బొరసే భూషణ్ గులాబ్రావు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకడు బాధితురాలితో నిరుడు డిసెంబరులో స్నేహం చేశాడు. ఆమెను ఓ నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అక్కడికి తన స్నేహితులను పిలిచాడు. వీరంతా కలిసి ఆమెపై అత్యాచారం చేసి, మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. వీరిలో ముగ్గురు నిందితులు ఈ వీడియోలను లీక్ చేస్తామని ఆమెను బెదిరించి, జనవరిలో మరోసారి అత్యాచారం చేశారు. నిందితులంతా మేజర్లే. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు, మరొకడు పరారీలో ఉన్నాడు. సాక్ష్యాధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం ప్రయత్నిస్తున్నది.