న్యూఢిల్లీ, జూలై 15: దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏండ్ల బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్లో పదో తరగతి చదువుతున్న బాలికను కారులో ఎక్కించుకుని మహిపాల్పూర్కు వెళ్తూ ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. ఈ ఘటన జూలై 6వ తేదీన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 6 సాయంత్రం తన స్నేహితురాలి ఇంటి నుంచి వచ్చాక ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని వసంత విహార్ మార్కెట్ వద్ద చూశానని పేర్కొన్నది. కాసేపయ్యాక మూడో వ్యక్తిని వాళ్లు పిలిచారని తెలిపింది. మూడో వ్యక్తి కారులో వచ్చి తనను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని వెల్లడించింది.
ఒకరితో ముందే పరిచయం..
నిందితుల్లో ఒకరితో బాలికకు ముందే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ముందుగా మహిపాల్పూర్కు వెళ్లి, అక్కడ మద్యం కొనుగోలు చేశారని వివరించారు. ఆ తర్వాత కారును ఆ పరిసరాల్లో తిప్పారని, బాలికకు కూడా బలవంతంగా మద్యం తాగించారని చెప్పారు. కారు కదులుతుండగానే బాలికపై ఆ ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఓ నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి ఆమెను తీవ్రంగా కొట్టారని వెల్లడించారు. పైగా ఈ దురాగతం మొత్తాన్ని వాళ్లు ఫోన్లలో వీడియో తీసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.