భోపాల్: పదహారేండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులు కదులుతున్న అంబులెన్స్‌లో ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఈ నెల 25న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి జనని ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో ఎక్కించారని, అందులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, అతడి స్నేహితుడు రాజేశ్ కేవాత్లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె లైంగికదాడికి గురైనట్టు నిర్ధారణ అయింది. కాగా, గత నెల 21న రేవా జిల్లాలో కొత్తగా పెళ్లయిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. భర్తతో కలిసి పిక్నిక్కు వెళ్లిన ఆమెను కిడ్నాప్ చేసిన దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.